చలో రాజ్‌భవన్ విజయవంతం




నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి: టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్ రాష్ట్ర ప్రతినిధి.. జూలై 22(బుధవారం):నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన "చలో రాజ్‌భవన్ (లోక్ భవన్)" కార్యక్రమం ఉద్రిక్త వాతావరణంలో సాగింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. రాజ్‌భవన్ వద్ద పోలీసులు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు అనంతరం మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. నీట్ పేపర్ లీక్ కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

నీట్ పేపర్ లీక్ అంశంపై ప్రశ్నించినందుకు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష ఎంపీలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం హరించే ప్రయత్నం చేస్తోందని అన్నారు.

దేశంలో పోలీసు రాజ్యం నడపాలని చూస్తే ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు మరియు యువత అంగీకరించరని ఆయన పేర్కొన్నారు. యువత భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, కానీ విద్యార్థుల హక్కుల కోసం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

కొంతమంది "పైడ్ ఆర్టిస్టులు" ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, దేశ యువత మాత్రం రాహుల్ గాంధీ నాయకత్వానికే మద్దతుగా నిలుస్తోందన్నారు.

రాజ్‌భవన్ వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ బలమూరి వెంకట్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, రోహిన్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Post a Comment

Previous Post Next Post

Janani Web Solutions

Janani Web Solutions
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview